తను ఆకాశ వీధిలో అందాల జాబిలి
Anaganaga oka Mahanati — a tribute to Actress Savitri
ఒక పాత్రతో వర్ణించలేము...
ఒక మాటతో చెప్పలేము...
ఆమె గురించి రాయాలంటే
జ్ఞాపకాలే కలం పట్టాలి.
నవ్వితే వెన్నెల కూడా
తన వెలుగును మరిచిపోయేది.
ఏడిస్తే తెర ముందు కూర్చున్న
ప్రతి హృదయం తడిసిపోయేది.
ఆమె కళ్లలో మాటలుండేవి,
ఆమె మౌనంలో కథలుండేవి.
ఆమె తెరపై కనిపిస్తే
ఒక పాత్ర కాదు...
ఒక జీవితం కనిపించేది.
ఆమె అందాన్ని వర్ణించడానికి
కవులకు పదాలు చాలలేదు.
ఆమెను గానంలో బంధించడానికి
గాయకులకు పాటలు చాలలేదు.
ఆమె నటనను కొలవడానికి
కాలానికి సంవత్సరాలు చాలలేదు.
ఎన్నో పేర్లు
కాలనదిలో అలలా వచ్చి వెళ్లిపోయాయి...
కానీ కొన్ని పేర్లు మాత్రమే
కాలం అనే పుస్తకంలో
చెరిగిపోని అక్షరాలవుతాయి.
ఎప్పుడు ఎక్కడ పాత సినిమా చూసినా
ఒక జ్ఞాపకమై వస్తుంది.
పాత పాట వినిపించినా
ఒక రూపమై కళ్లముందు నిలుస్తుంది.
ఆమెను తలుచుకుంటే అనిపిస్తుంది...
కొంతమంది మనుషులు
భూమిపై కొన్నేళ్లు మాత్రమే ఉంటారు,
కానీ మనసుల్లో మాత్రం
శాశ్వతంగా ఉండిపోతారు అని.
బిరుదులు ఎన్ని వచ్చినా,
గౌరవాలు ఎన్ని దక్కినా,
కథను పైవాడు ఎలా రాసినా,
జీవితాన్ని కాలం ఎలా మలిచినా,
తను మాత్రం
మర్చిపోలేని ఒక అందమైన స్మృతి.
దేవదాసులో పార్వతిగా,
మిస్సమ్మలో మేరీగా,
మాయాబజార్‌లో సుందరిగా,
ప్రతి హృదయంలో చిరస్థాయిగా.
తను ఆకాశ వీధిలో అందాల జాబిలి...
అనగనగా ఒక మహానటి.
— Sai Pranay Tadakamalla